Thursday, 8 September 2016

జీఎస్టీ బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ఆమోదం


న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్‌ (జీఎస్టీ) రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు రాష్ట్ర‌పతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ గురువారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు, మొత్తం 29లో 16 రాష్ట్రాలు జీఎస్టీ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దేశంలోని సంక్లిష్ట పరోక్ష ప‌న్ను వ్య‌వ‌స్థ‌ను జీఎస్టీ స‌ర‌ళీకృతం చేయ‌నుంది. దీనివ‌ల్ల దేశమంతా ఒకే ప‌న్ను విధానం అమ‌ల్లోకి రానుంది. ఎన్డీయే ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ బిల్లును గతేడాదే లోక్‌స‌భ ఆమోదించినా.. రాజ్య‌స‌భ‌లో పెండింగ్ ప‌డుతూ వ‌చ్చింది. చివ‌రికి కాంగ్రెస్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన కేంద్రం.. ఆ పార్టీ సూచించిన కీల‌క స‌వ‌ర‌ణ‌ల‌కు ఓకే చెప్ప‌డంతో ఆగ‌స్ట్‌లో రాజ్య‌స‌భ కూడా జీఎస్టీ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ త‌ర్వాత ఈ బిల్లు రాష్ట్రాల ఆమోదం కోసం వెళ్లింది. ఇప్ప‌టికే తెలంగాణ‌తో పాటు 15 రాష్ట్రాలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి.

0 comments:

Post a Comment