Saturday, 20 August 2016

సరోద్ విద్యాంసుడు అంజాద్ అలీఖాన్‌కు బ్రిటన్ వీసా మంజూరు




న్యూఢిల్లీ: ప్రముఖ సరోద్‌ విద్వాంసుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్‌ అంజాద్‌ అలీఖాన్‌ (70)కు బ్రిటన్‌ వీసా మంజూరు చేసింది. ఆయన వీసా దరఖాస్తును అసంపూర్ణ సమాచారం కారణంగా ఇటీవల బ్రిటన్ తిరస్కరించింది. తనకు వీసా నిరాకరించిన విషయాన్ని అంజాద్ అలీఖాన్ ఇటీవల ట్విట్టర్‌లో వెల్లడించడంతో అది సంచలనమైంది. గతంలో తనకు ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, బ్రిటన్‌లో భారత రాయబార కార్యాలయం, ఇండియాలోని బ్రిటన్ ఎంబసీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో బ్రిటన్ రాయబార కార్యాలయం స్పందించి...అంజాద్ అప్లికేషన్ సరైన ఫార్మెట్‌లో ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలో ఆయనకు బ్రిటన్ తాజాగా వీసా మంజూరు చేసింది. దీనిపై సరోద్ మాస్ట్రో ఉస్తాద్ అలీఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. వీసా విషయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో తన సందేశం ఉంచారు. వీసా విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారంటూ భారత సంతతి ఎంపీ కీత్‌ వాజ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను ముందుగా చెప్పినట్టే సెప్టెంబరు 18న లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో దర్శన ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న్టటు చెప్పారు.

0 comments:

Post a Comment